UGC NET NOTIFICATION JUNE-2025
నెట్ స్కోరుతో పరిశోధన.. కొలువుల సాధన!
సబ్జెక్టుల్లో ప్రతిభకు కొలమానంగా, మేటి అవకాశాలకు వేదికగా యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిలుస్తోంది. దీన్ని ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ పరిశోధనలో కొనసాగడానికీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పోటీకీ, పీహెచ్‌డీలో ప్రవేశానికీ, కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలకూ నెట్ స్కోరే ప్రామాణికం. ఇటీవలే యూజీసీ నెట్ జూన్-2025 ప్రకటన వెలువడింది.
ఈ పరీక్షను 85 సబ్జెక్టుల్లో రాసుకోవచ్చు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉన్నప్పటికీ అర్హత సాధించడానికి 3 కేటగిరీలు ఉన్నాయి. అవసరాల ప్రకారం వాటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
కేటగిరీ-1: ఎంపికైనవారు ప్రతి నెలా యూజీసీ నిర్దేశిత స్టైపెండ్ (జేఆర్‌ఎఫ్) పొందుతూ పరిశోధన (పీహెచ్‌డీ) కొనసాగించుకోవచ్చు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, జేఆర్‌ఎఫ్ లేకుండా జరిపే పీహెచ్‌డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-2: ఇందులో అవకాశం వస్తే జేఆర్‌ఎఫ్ దక్కదు. కానీ, వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-3: వీరు పీహెచ్‌డీలో ప్రవేశానికే అర్హులు. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హత ఉండదు.
ప్రయోజనాలేంటి?
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) అవకాశం వచ్చినవారు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ)లో చేరవచ్చు. వీరికి ప్రతి నెలా రూ.37,000 మొదటి రెండేళ్లు చెల్లిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.42,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. సంస్థ వసతి కల్పించనకపోతే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ ఫ్యాకల్టీ సభ్యుల ఎంపికలో నెట్ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉంటే అధిక వేతనమూ దక్కుతుంది.
జాతీయ స్థాయిలో ఎస్సీ, దివ్యాంగ, ఓబీసీ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికి నెట్ అర్హత తప్పనిసరి.
కొన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్ స్కోరుతో మేనేజ్‌మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి.
ప్రైవేటు సంస్థలు సైతం నెట్ అర్హులకు కొలువుల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
ఈ స్కోరుతోనే రాష్ట్రీయ సంస్థల్లోనూ పీహెచ్‌డీలో చేరవచ్చు.
పరీక్ష ఎలా?
ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు లేవు.
పేపర్-1 టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలకు వంద మార్కులు.
రెండో పేపర్ 200 మార్కులకు. వంద ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నపత్రం ఎంచుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి ఉంటుంది.
యూజీసీ వెబ్‌సైట్‌లో సబ్జెక్టులవారీ సిలబస్ వివరాలు ఉన్నాయి. వాటిని బాగా పరిశీలించి, అంశాల వారీ విస్తృతంగా చదవాలి.
ప్రాథమికాంశాలపై అవగాహన కోసం ఇంటర్మీడియట్, యూజీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ఆ తర్వాత పీజీతోపాటు రిఫరెన్స్‌లు అవసరం మేరకు అధ్యయనం చేయాలి.
పలు అంశాలను జోడించే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులో లోతైన పరిజ్ఞానం కోసం ప్రతి అంశాన్నీ సూక్ష్మ స్థాయిలో చదవాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటినే మళ్లీ మననం చేసుకోవాలి.
గత ప్రశ్నపత్రాలు క్షుణ్నంగా పరిశీలించాలి. వీటి ద్వారా ఏం చదవాలి, ఎలా చదవాలో అవగాహన పెంచుకోవచ్చు.
చదవడం పూర్తయిన తర్వాత కనీసం పది నమూనా పరీక్షలు రాయాలి. పరీక్షల వారీ ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా, స్కోరు మెరుగుపరచుకోవాలి.
రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకూ బాగా ఆలోచించి జవాబు గుర్తించాలి. ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా, అందులో పొరపాట్లు ఉన్నా బోనస్ మార్కులు ఇస్తారు. ఏదో ఒక ఆప్షన్ సమాధానంగా గుర్తిస్తేనే ఈ మార్కులు కలుపుతారు. అందుకే అన్ని ప్రశ్నలకూ జవాబు ఇస్తేనే మేలు.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి డిగ్రీలో 75 శాతం మార్కులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లకు 70 శాతం చాలు. యూజీతో జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీల్లో ప్రవేశానికే అర్హులు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడలేరు. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందడానికి, పీహెచ్‌డీ ప్రవేశానికీ వయసు నిబంధన లేదు. జేఆర్‌ఎఫ్‌కు జూన్ 1, 2025 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, థర్డ్ జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: మే 7 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/అన్ రిజర్వ్‌డ్ రూ.1150. జనరల్(ఈడబ్ల్యూఎస్), ఓబీసీ(ఎన్‌సీఎల్) రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు రూ.325.
పరీక్షలు: జూన్ 21 నుంచి 30 వరకు.
వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/
Social Plugin